lok sabha: లోక్ సభలో జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్ రెడ్డి
- సరిహద్దు, నియంత్రణ రేఖ సమీపంలో ఉండే యువత కోసం బిల్లు
- బిల్లు పాసైతే ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు
- అమిత్ షా బదులు బిల్లును ప్రవేశపెట్టిన కిషన్ రెడ్డి
జమ్ముకశ్మీర్ లో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ... చివరి నిమిషంలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు. జమ్ములో అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో, కశ్మీర్ లో నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు.
మరోవైపు, ఆధార్ చట్ట సవరణ బిల్లు 2019ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. ఆందోళనల మధ్యే ఈ బిల్లుపై రవిశంకర్ ప్రసాద్ ప్రసంగం చేశారు. అనంతరం ప్రత్యేక ఆర్థిక జోన్ల సవరణ బిల్లును కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు.