Andhra Pradesh: టీడీపీకి మరో షాక్.. జనసేనలోకి వంగవీటి రాధా.. పవన్ తో భేటీ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-1ce0d884a5497e41804ecb8e08af1cb4b5fa696b.jpg)
- విజయవాడలో పవన్ కల్యాణ్ తో భేటీ
- నేడు లేదా రేపు జనసేనలో చేరే ఛాన్స్
- ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రాధా
ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. విజయవాడలో ఈరోజు పవన్ కల్యాణ్ తో సమావేశమైన రాధ, ఏపీలో రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై జనసేనానితో చర్చించినట్టు సమాచారం.
మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఈ భేటీ జరిగింది. కాగా, ఈరోజు సాయంత్రం లేదా రేపు వంగవీటి రాధ జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ నుంచి బయటకొచ్చిన రాధా టీడీపీలో చేరారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ పార్టీని వీడిన నేపథ్యంలో వంగవీటి కూడా పార్టీని వీడనుండడం టీడీపీకి నష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.