Air India: ఓ షాపులో భారత పైలెట్ చేతివాటం... వెంటనే సస్పెండ్ చేసిన ఎయిరిండియా
- వాలెట్ దొంగిలించిన సీనియర్ పైలెట్
- విచారణ ప్రారంభించిన ఎయిరిండియా
- పైలెట్ కు నోటీసులు
ఎయిరిండియా సంస్థకు చెందిన ఓ సీనియర్ పైలెట్ సిడ్నీ విమానాశ్రయంలోని షాపులో చోరీకి పాల్పడి అభాసుపాలయ్యాడు. ఆ పైలెట్ పేరు రోహిత్ భాసిన్. ఏఐ 301 విమానానికి ఆయన సీనియర్ పైలెట్. ఆ విమానం శనివారం ఉదయం సిడ్నీ నుంచి ఢిల్లీ రావాల్సి ఉంది.
అయితే విమానం బయల్దేరడానికి ముందు రోహిత్ భాసిన్ ఎయిర్ పోర్టులో ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లి కంటికి నచ్చిన వాలెట్ ను తస్కరించినట్టు ఆరోపణలు రావడంతో ఆస్ట్రేలియా అధికార వర్గాలు ఎయిరిండియాకు సమాచారం అందించాయి. వెంటనే స్పందించిన ఎయిరిండియా వర్గాలు రోహిత్ ను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించాయి. ఈ మేరకు నోటీసులు పంపింది. కాగా, రోహిత్ భాసిన్ ఎయిరిండియాలో సీనియారిటీ అనుసరించి ఈస్ట్రన్ డివిజన్ రీజనల్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి వాలెట్ దొంగిలించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.