YSRCP: గతంలో వైసీపీ నేతలను టీడీపీలో ఎలా చేర్చుకున్నారు?: కిషన్ రెడ్డి
- రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నారు
- వారికి మంత్రి పదవులిచ్చిన చరిత్ర టీడీపీది
- ఇలాంటి పార్టీకి చెందిన నేతలా విమర్శించేది!
రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తగిన సమాధానం చెప్పారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం రాజ్యాంగం ప్రకారం జరిగిందని, దీన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. గతంలో వైసీపీ నేతలను టీడీపీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీకి చెందిన నేతలకు ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.