Facebook: ఫేస్ బుక్ లో ప్రేమపెళ్లి ఫొటోలు... 24 గంటలు గడిచేసరికి విగతజీవులుగా..!
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
- ఆలయంలో వివాహం, ఆపై లాడ్జిలో బస
- పెద్దలు అంగీకరించరని ఆత్మహత్య
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఓ జంట, మైనారిటీ తీరగానే ప్రేమ వివాహం చేసుకుని, ఆ తరువాతి రోజే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, బుట్టాయి గూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన నాగంపల్లి శేఖర్ (20) 2016లో కాలేజీలో చదువుతున్న వేళ, సరిపల్లికుంటకు చెందిన తెల్లం పోశమ్మ (18)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించి ఇంట్లో చెప్పగా, ఎవరూ అంగీకరించలేదు. దీంతో గత సంవత్సరం జనవరిలో ఇంట్లో నుంచి పారిపోయారు. ఇద్దరి తల్లిదండ్రులూ పోలీసులను ఆశ్రయించడంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. అయినా వీరి మధ్య ప్రేమ కొనసాగింది. పోశమ్మ మైనారిటీ తీరగానే పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు.
ఈ నెల 9వ తేదీతో పోశమ్మ మేజర్ కాగా, శుక్రవారం నాడు ఇద్దరూ ఇళ్ళ నుంచి వేరువేరుగా బయటకు వచ్చేసి జంగారెడ్డిగూడెం సమీపంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. రహస్యంగా పెళ్లి చేసుకుని, సెల్ ఫోన్ లో ఫొటోలు తీసుకుని, వాటిని ఫేస్ బుక్ లో పెట్టగా, అవి వైరల్ అయ్యాయి.
ఆపై గుర్వాయిగూడెంకు వెళ్లిన వీరు, ఓ లాడ్జిలో బస చేశారు. మరుసటి రోజు ఉదయం వరకూ రూమ్ లో ఎటువంటి కదలికా లేకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు గది తలుపులు పగులగొట్టి చూడటంతో శేఖర్, పోశమ్మలు ఒకే మంచంపై అపస్మారక స్థితిలో కనిపించారు. వీరిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శేఖర్ చనిపోయాడు. చికిత్స మొదలు పెట్టిన కాసేపటికే పోశమ్మ కూడా మృతిచెందింది.
వీరిద్దరూ పురుగుల మందు తాగారని, తన వివాహానికి ఇంట్లో వారు ఒప్పుకోరన్న కారణంతోనే వారు ఈ పని చేశారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు తెలిపారు.