Smruti Irani: పదిహేనేళ్లుగా రాహుల్ గాంధీ చేయలేకపోయిన పనిని చేస్తున్న స్మృతీ ఇరానీ!
- మూడు సార్లు అమేథి నుంచి గెలిచిన రాహుల్
- ఇక్కడే నివాసం ఉంటానని చెప్పడమేగానీ, చెయ్యని రాహుల్
- సొంత ఇంటిని నిర్మించుకుంటున్న స్మృతీ ఇరానీ
2004 నుంచి 2019 వరకూ, పదిహేను సంవత్సరాల పాటు అమేథి లోక్ సభ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ చేయలేకపోయిన పనిని, ఇటీవలి ఎన్నికల్లో ఆయనకు ఓటమిని రుచిచూపించిన స్మృతీ ఇరానీ చేయనున్నారు. అమేథిలోనే తాను నివాసాన్ని ఏర్పరచుకుంటానని గతంలో పలుమార్లు చెప్పిన రాహుల్, ఇంతవరకూ ఆ పని మాత్రం చేయలేదు. ఇక, లోక్ సభకు ఎన్నికైన నెలరోజుల వ్యవధిలోనే స్మృతీ, సొంత ఇంటికి ముహూర్తం పెట్టేశారు. స్థానిక గౌరీగంజ్ ప్రాంతంలో స్థలాన్ని తీసుకున్నానని, ఇక్కడే తన శాశ్వత నివాసం ఉండబోతుందని ఆమె అన్నారు. ఇక స్మృతీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ శ్రేణులు పొగడ్తలు కురిపిస్తున్నాయి. తనను ఆదరించిన అమేథి ప్రజలతో ఆమె మమేకపై పోవాలని భావిస్తున్నారని, ఇకపై కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విజయం సాధించే చాన్స్ ఉండదని చెబుతున్నారు.