Uttar Pradesh: ప్రభుత్వ ఉద్యోగి చేత షూ లేస్ కట్టించుకున్న యూపీ మంత్రి.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు!
- షాజహాన్ పూర్ లో యోగా డే సందర్భంగా ఘటన
- తన చర్యను సమర్థించుకున్న మంత్రి లక్ష్మీ నారాయణ్
- ఇక్కడ 14 ఏళ్లు చెప్పులు దేశాన్ని పాలించాయని వ్యాఖ్య
యూపీలోని షాజహాన్ పూర్ లో నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. దీనికి యూపీ మంత్రి లక్ష్మి నారాయణ్ హాజరయ్యారు. అయితే వేదిక దగ్గరకు వస్తుండగా ఆయన వేసుకున్న షూ లేస్ ఒకటి ఊడిపోయింది. వెంటనే పక్కన ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ముందుకు వచ్చి ఆయన షూ లేస్ కట్టాడు. అయితే దీన్ని వారించని నారాయణ్ ఎంజాయ్ చేస్తూ నిలబడ్డారు.
ఈ వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలామంది నెటిజన్లు మంత్రిపై దుమ్మెత్తి పోశారు. ప్రభుత్వ ఉద్యోగి చేత షూ లేసులు కట్టించుకోవడం ఏంటని తలంటారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి నారాయణ్ స్పందిస్తూ..‘షూ లేస్ కట్టి నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను. భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ రాముని బదులు ఆయన పాదరక్షలు 14 ఏళ్ల పాటు పాలన చేశాయి. మన పురాణాల్లో పాద రక్షలకు చాలా ప్రాధాన్యం ఉంది. అసలు ఈ ఘటనను మీరు కూడా అభినందించాలి’ అని మీడియాకే కౌంటర్ వేశారు.