punjab: సిద్ధూ! రాజీనామా చేసి వెళ్లిపో.. పంజాబ్ లో ప్రత్యక్షమైన పోస్టర్లు!
- అమేథీలో రాహుల్ గెలుస్తాడన్న సిద్ధూ
- లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
- మాట నిలబెట్టుకోవాలని లూథియానాలో పోస్టర్లు ప్రత్యక్షం
రాజకీయ నేతలు హామీలు ఇచ్చేటప్పుడు, సవాళ్లు విసిరేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చివరికి అవే వారి మెడకు చుట్టుకుంటాయి. తాజాగా పంజాబ్ రాష్ట్ర మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు ఇదే పరిస్థితి ఎదురయింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిద్ధూ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఒకవేళ గెలవకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కాగా, ఈ ఎన్నికల్లో అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని 55,120 ఓట్ల తేడాతో ఓడించారు. అయితే కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ‘సిద్ధూ ఎప్పుడు రాజీనామా చేస్తున్నావ్?’ అని పంజాబ్ లోని లూథియానాలో పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటపై సిద్ధూ నిలబడాలని ఆ పోస్టర్లలో డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై సిద్ధూ ఇంతవరకూ స్పందించలేదు.