Tamil Nadu: 20 లక్షల లీటర్ల నీటిని పంపిస్తామన్న కేరళ.. అవసరం లేదన్న తమిళనాడు

  • తమిళనాడుకు కనీవినీ ఎరుగని నీటి కష్టాలు
  • కేరళ ప్రతిపాదనకు పళని ప్రభుత్వం తిరస్కరణ
  • రోజూ అంతమొత్తంలో సరఫరా చేస్తే బాగుంటుందన్న పళనిస్వామి

తమిళనాడు ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాల సరిపడా కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు. దీంతో చెన్నై వాసుల నీటి కష్టాలు తీర్చేందుకు కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రజల అవసరాల కోసం 20 లక్షల లీటర్ల నీటిని పంపిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముందుకొచ్చారు. అయితే, ఈ ప్రతిపాదనను తమిళనాడు సీఎం పళనిస్వామి సున్నితంగా తిరస్కరించారు.

చెన్నైకి రోజుకు 52.2 కోట్ల లీటర్ల నీటి అవసరం ఉందని, అలాంటిది 20 లక్షల లీటర్ల నీటిని తామేం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ నీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. ఒకసారి 20 లక్షల లీటర్ల నీటిని ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, రోజూ అంతమొత్తంలో నీరు సరఫరా చేయగలిగితే కొంత వరకు ప్రజల నీళ్ల కష్టాలు తీరుతాయంటూ కేరళ సీఎంకు లేఖ రాశారు.

అలాగే,  ముల్ల పెరియార్‌ జలాశయంలో పూర్తి స్థాయి వరకు నీటిని నిల్వ చేసేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల ప్రజలకు ఈ జలాశయమే ఆధారమని, కాబట్టి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు. అయితే విజయన్ మాత్రం మరోలా స్పందించారు. తమ రాష్ట్రానికి కావాల్సిన నీటి సరఫరా ఉందని, పొరుగు రాష్ట్రాల సాయం అవసరం లేదని తమిళనాడు ప్రభుత్వం బదులిచ్చిందని కేరళ సీఎం ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు.  

Tamil Nadu
Kerala
Water
Chennai
Palanisamy
  • Loading...

More Telugu News