Bihar: తేజస్వీయాదవ్ ఆచూకీ చెబితే రూ.5100 నజరానా.. కలకలం రేపుతున్న పోస్టర్
- మెదడువాపు వ్యాధితో 112 మంది చిన్నారుల మృత్యువాత
- పట్టించుకోని ప్రధాన ప్రతిపక్షం
- తేజస్వీ ఎక్కడున్నారో పార్టీ నేతలకే తెలియని వైనం
బీహార్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ ఆచూకీ చెప్పిన వారికి రూ.5100 నజరానా ప్రకటిస్తూ వెలసిన పోస్టర్ కలకలం రేపుతోంది. బీహార్‌ను ప్రస్తుతం మెదడువాపు వ్యాధి కుదిపేస్తోంది. దీని బారిన పడి ఇప్పటి వరకు 112 మంది చిన్నారులు మృతి చెందారు. మరెంతో మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ మరణాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన తేజస్వీ యాదవ్ విదేశాలకు వెళ్లిపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తేజస్వీ యాదవ్ ఎక్కడున్నారో నిజానికి ఆ పార్టీ నేతలకు కూడా తెలియడం లేదు. ప్రపంచకప్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ఆయన లండన్ వెళ్లారని కొందరంటే, వ్యక్తిగత పనిమీద ఆస్ట్రేలియా వెళ్లారని మరికొందరు అంటున్నారు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారన్న దానిపై పార్టీ నేతల్లోనే స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత తీరుపై ప్రజలు తమ వ్యతిరేకతను ఇలా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆచూకీ చెప్పిన వారికి రూ.5100 ఇస్తామంటూ ముజఫర్‌నగర్‌లో పోస్టర్లు అతికించారు.