Telugudesam: టీడీపీని బాగా ఇబ్బంది పెడుతున్నారు..ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో!: ఎమ్మెల్యే కరణం బలరాం
- మోదీ, అమిత్ షాపై విమర్శలు
- బీజేపీలో చేరాలని మాజీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి
- ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉందో లేదో నాకు తెలియదు
టీడీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిన నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కరణం బలరాం విమర్శలు గుప్పించారు. టీడీపీని బాగా ఇబ్బంది పెడుతున్నారని, ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యసభ టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడంపై న్యాయపోరాటం చేస్తారా? అన్న ప్రశ్నకు కరణం బలరాం సమాధానమిస్తూ, చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం గురించి ఆయన వద్ద విలేకరులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా కరణం బలరాం జవాబిస్తూ, ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడతారన్న సమాచారం తనకు లేదని, మాజీ ఎమ్మెల్యేలపై మాత్రం ఒత్తిడి చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందని చెప్పారు.