Chandrababu: నేను చెప్పినట్టుగానే జరుగుతోంది: బీజేపీ ఎంపీ జీవీఎల్
- బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు సిద్ధం
- విమర్శలు చేసిన వాళ్లూ బీజేపీలో చేరుతున్నారు
- బీజేపీలో చేరికలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేను
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, కేంద్రంలో తమ పాలన, మోదీ ఆలోచనా సిద్ధాంతాలు నచ్చడం వల్లే టీడీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ తరుణంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును ఢిల్లీలో మీడియా పలకరించింది.
భవిష్యత్తులో ఈ వలసలు కొనసాగుతాయా అన్న ప్రశ్నకు జీవీఎల్ స్పందిస్తూ, అనేక రాజకీయ పార్టీల నాయకులు బీజేపీలో చేరాలని ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని గతంలోనే చెప్పానని, తాను చెప్పినట్టుగానే జరుగుతోందని అన్నారు.
బీజేపీని విమర్శించిన నాయకులే ఈరోజు తమ పార్టీలో చేరుతున్నారంటే తమ పార్టీకే భవిష్యత్తు ఉందన్న విషయం వారికి అర్థమైందని అన్నారు. అందుకే, తమ పార్టీలోకి వచ్చే వారిని స్వాగతిస్తున్నామని చెప్పారు. తమకు రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున ఇతర పార్టీల ఎంపీలు తమ పార్టీలో చేరడం తమకు దోహదం చేసినట్టేనని, బీజేపీలో చేరికలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేనని వేచి చూడాల్సిందేనని అన్నారు. బీజేపీలో చేరేందుకు ఇష్టపడ్డ వారే వస్తున్నారు తప్ప, బలవంతపు చేరికలు లేవని స్పష్టం చేశారు.