Vijayasanti: నేడు టీడీపీకి పట్టిన గతే రేపు టీఆర్ఎస్ కు కూడా: విజయశాంతి
- పార్టీల వైఖరి కారణంగానే ఫిరాయింపులు
- కీలక పదవులు వ్యాపారులకు ఇవ్వడంతోనే సమస్య
- ఫేస్ బుక్ లో విజయశాంతి
ఇండియాలో రాజకీయ నాయకులు పార్టీలను మారుతున్న సమస్యలకు కొన్ని పార్టీల వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు.
"ప్రస్తుతం దేశంలోని పార్టీ మార్పు సమస్య మొత్తం ఆ పార్టీల కొన్ని నిర్ణయాల తప్పిదం. సిద్ధాంత విధానాల కోసం ఉన్న కార్యకర్తల బదులుగ ,వ్యాపార నిర్బంధాలు ఉన్న పెద్దలకు కీలక పదవుల నియామకంలో స్థానం కల్పించడం వల్ల ఇది ఉత్పన్నమవుతూ వచ్చింది. టిడిపి, టిఆర్ఎస్ లు ఈ స్థితిని పోషిస్తు వచ్చాయి. రెండు,మూడు తరాలనుండి డీఎంకే, ఏఐఏడీఎంకేలు అనుసరిస్తున్న ఈ గుణాత్మక రాజకీయ విధానాన్ని అర్ధం చేసుకోకుండా ఆ సాంస్కృతిక, సమున్నత ప్రాంతీయ ఆత్మ గౌరవ వ్యవస్థను నిర్మించకుండా, డీఎంకే, ఏఐఏడీఎంకే అనుకుంటూ కేవలం ప్రసంగాలతో కేసీఆర్ గారు వ్యవహరిస్తే, ఏపీ టీడీపీలోని పరిణామాలు,తెలంగాణలోని టీఆర్ఎస్ కు తప్పనిసరి భవిష్యత్ సన్నివేశంగా ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడుతున్నారు.
రెండు ప్రాంతీయ పార్టీలు సమర్ధవంతమైనవయితే జాతీయ పార్టీలకు స్థానం దొరకక పోవచ్చు అనేది వాస్తవం. కానీ రెండు జాతీయ పార్టీలు బలోపేతమై పోరాడితే ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్టాలలో స్థాయి తగ్గిపోవడం కూడా అంతే వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది స్పష్టంగానే అర్ధంచేసుకుంటారని అనుకుంటున్నాను" అని అన్నారు.