Gold: ఒక్కరోజులో రూ. 500కు పైగా పెరిగిన బంగారం ధర!
- రూ. 3,211కు చేరుకున్న గ్రాము బంగారం ధర
- భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం
- ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ మార్కెట్
బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం నాడు గ్రాము రూ. 3,174గా ఉన్న బంగారం ధర పది గ్రాములకు గురువారం నాటికి రూ. 512 పెరిగింది. దీంతో సవర బంగారం కొనాలంటే రూ. 25 వేలకు పైగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 2018లో పెరుగుతూ వచ్చిన ధరలు, ఆపై ఓ దశలో తగ్గినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తిరిగి పెరుగుతున్నాయి. గ్రాము బంగారం ధర రూ. 3,211కు పెరిగింది. గురువారం ఉదయం రూ. 3,100 వద్ద ఉన్న బంగారం ధర సాయంత్రానికి రూ. 3,200కు పైగా చేరడం గమనార్హం. సమీప భవిష్యత్తులో బంగారం ధర మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు అనిశ్చితిలో ఉండటంతో పెట్టుబడిదారులను బులియన్ మార్కెట్ ఆకర్షిస్తోంది. ఆభరణాల తయారీదారులు బంగారం కొనుగోలుకు యత్నించడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది.