Telugudesam: ఇది కచ్చితంగా ఫిరాయింపుల కిందకే వస్తుంది, టీడీపీ మనుగడకు ఎలాంటి ప్రమాదంలేదు: కనకమేడల

  • ఫిరాయింపులను ప్రోత్సహించడం బీజేపీకి తగదు
  • ఎంపీలు టీడీపీ పార్లమెంటరీ పార్టీ లెటర్ హెడ్ తో లేఖ ఇచ్చారు
  • విలీనం చేయడం కుదరదు

ఇప్పటివరకు టీడీపీ అగ్రనాయకులుగా చలామణి అయిన సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై, టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. రాజ్యసభ చైర్మన్ కు టీడీపీ ఎంపీలు లేఖ ఇవ్వడం విచారించదగ్గ అంశం అని అభిప్రాయపడ్డారు. గెలిచిన పార్టీలో చేరడం 'మూడ్ ఆఫ్ ద నేషన్' ఎలా అవుతుందని ప్రశ్నించారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ లెటర్ హెడ్ తో లేఖ ఇచ్చారని, రాజ్యసభ చైర్మన్ కు ఇచ్చిన లేఖతో పార్టీకి సంబంధం లేదని కనకమేడల స్పష్టం చేశారు. రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం కుదరదని, ఇది పార్టీ ఫిరాయింపుల కిందికే వస్తుందని అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం బీజేపీకి తగదని హితవు పలికారు. పదో షెడ్యూల్ ను తప్పుదోవ పట్టించడమే తప్ప, విలీనం సాధ్యం కాదని వివరించారు. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, టీడీపీ మనుగడకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

Telugudesam
Kanakamedala Ravindra Kumar
  • Loading...

More Telugu News