Cricket: మరో ఓవర్ మిగిలుండగా వరుణుడు ప్రత్యక్షం... ఆసీస్ 368/5 (49 ఓవర్లు)
- వార్నర్ సెంచరీ
- శతకం చేజార్చుకున్న ఖవాజా
- మ్యాక్స్ వెల్ మెరుపులు
బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ విధ్వంసం సృష్టించారు. బంగ్లా బౌలింగ్ ను ఊచకోత కోస్తూ పరుగుల వర్షం కురిపించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166) సెంచరీ సాధించగా, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (53), ఉస్మాన్ ఖవాజా (89) అర్ధసెంచరీలు సాధించారు.
చివరి ఓవర్లలో గ్లెన్ మ్యాక్స్ వెల్ మెరుపు ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడిన మ్యాక్స్ వెల్ కేవలం 10 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. అయితే, మరొక్క ఓవర్ వేస్తే 50 ఓవర్లు పూర్తవుతాయన్న సమయంలో వరుణుడు ప్రత్యక్షం కావడంతో ఆట నిలిచిపోయింది. దాంతో, ఆసీస్ ఇన్నింగ్స్ కు 49 ఓవర్లలో 5 వికెట్లకు 368 పరుగుల స్కోరు వద్ద బ్రేక్ పడింది.
విశేషం ఏంటంటే, మ్యాచ్ లో 45 ఓవర్లపాటు ఏకధాటిగా బాదించుకున్న బంగ్లాదేశ్ బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. ఈ క్రమంలో వెంటవెంటనే వికెట్లు తీసి ఆసీస్ మరీ భారీస్కోరు సాధించకుండా కట్టడి చేశారు.