Virat Kohli: తన నిజాయతీతో ఇతర కెప్టెన్లకు చిక్కులు తెచ్చిపెడుతున్న విరాట్ కోహ్లీ!
- పాక్ తో మ్యాచ్ లో అంపైర్ అవుట్ ఇవ్వకున్నా మైదానం వీడిన కోహ్లీ
- దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో అవుటైనా ఆటను కొనసాగించిన విలియమ్సన్
- నెటిజన్ల విమర్శలు
పాకిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అంపైర్ అవుట్ ఇవ్వకపోయినా, బంతి తన బ్యాట్ కు తగిలిందన్న నమ్మకంతో పెవిలియన్ కు వెళ్లిపోయాడు. దాంతో కోహ్లీ నిజాయతీపై అన్నివైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రివ్యూ అడిగే అవకాశం ఉన్నా కోహ్లీ మాత్రం తన మనస్సాక్షికి కట్టుబడి మైదానం వీడాడు.
అయితే, చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ బ్యాట్ కు బంతి తగిలినా దాన్నెవరూ పట్టించుకోలేదు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లే అప్పీల్ చేయకుండా నిరాసక్తంగా కనిపించడంతో విలియమ్సన్ సైతం మనకెందుకులే అని బ్యాటింగ్ కొనసాగించాడు. తన బ్యాట్ కు బంతి తగిలిందని తెలిసినా గానీ విలియమ్సన్ మాత్రం అంపైర్ అవుటివ్వకపోవడంతో క్రీజులో కొనసాగాడు.
టీవీ రీప్లేలో బంతి బ్యాట్ కు తగిలినట్టు స్పష్టంగా కనిపించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విలియమ్సన్ తొండి ఆడాడని సామాజిక మాధ్యమాల్లో ఏకిపారేస్తున్నారు. ఓవైపు విలియమ్సన్ ను విమర్శిస్తూ, అదే సమయంలో కోహ్లీ నిజాయతీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ ప్రపంచంలో రెండు రకాల ప్రజలు ఉంటారని, ఒకటి విరాట్ కోహ్లీ వంటి ప్రజలు, రెండు కేన్ విలియమ్సన్ వంటి ప్రజలు అంటూ కివీస్ సారథికి తలంటుతున్నారు.