Andhra Pradesh: కాకినాడలో టీడీపీ కాపు నేతల రహస్య సమావేశం!
- తమ భవిష్యత్, కార్యాచరణపై చర్చ
- హాజరైన తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, బోండా
- బీజేపీ నేత విష్ణువర్ధన్ వ్యాఖ్యల నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి
టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే ఆ పార్టీలో ముసలం మొదలయింది. పార్టీ అధిష్ఠానానికి సమాచారం ఇవ్వకుండా టీడీపీ కాపు నేతలు ఈరోజు కాకినాడలో రహస్యంగా సమావేశం అయ్యారు. తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పంచకర్ల రమేశ్ బాబు, బోండా ఉమ, కదిరి బాబూరావు, బడేటి బుజ్జి, మీసాల గీత, వరుపుల రాజా, మాధవ నాయుడు, జ్యోతుల నెహ్రూ, ఈలి నాని సహా 20 మంది కాపు నేతలు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో టీడీపీలో తమ భవిష్యత్, ఏపీలో రాజకీయ పరిణమాలపై సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నేతలు అధిష్ఠానానికి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చేలోపు ఏపీ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన కొద్ది సేపటికే టీడీపీ కాపు నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం గమనార్హం.