all political parties: జమిలి ఎన్నికలపై కమిటీ వేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించాం: మంత్రి రాజ్ నాథ్ సింగ్
- ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం
- నాలుగు గంటలపాటు కొనసాగిన సమావేశం
- ఇరవై నాలుగు పార్టీల నేతల హాజరు
ఢిల్లీలో అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. ‘ఒకే దేశం- ఒకేసారి ఎన్నికలు’ ప్రధాన అజెండాగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి మొత్తం నలభై పార్టీల నేతలను ఆహ్వానిస్తే ఇరవై నాలుగు పార్టీల నేతలు హాజరయ్యారు. మొత్తం ఐదు అంశాలపై ప్రభుత్వం వివిధ పార్టీల అభిప్రాయాలు కోరింది.
అనంతరం, కేంద్ర రక్షణశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, జమిలి ఎన్నికలపై కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఇది ప్రభుత్వ అజెండా కాదని, దేశ అజెండా అని స్పష్టం చేశారు. కాగా, జమిలి ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ సహా పలు పార్టీలు మద్దతు తెలపగా, ఎంఐఎం, సీపీఐ, సీపీఎంలు వ్యతిరేకించాయి. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, టీడీపీ సహా పలు పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.