Andhra Pradesh: కోడెల కుమార్తెపై మరో కేసు.. ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఇప్పిస్తామని రూ.4 లక్షలు వసూలు!
- పూనాటి విజయలక్ష్మిపై డా.చక్రవర్తి ఫిర్యాదు
- నగదును వెనక్కి ఇప్పించాలని విజ్ఞప్తి
- ఇప్పటికే శివరామ్ పై పలు కేసులు నమోదు
టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మిపై తాజాగా మరో కేసు నమోదు అయింది. ఆరోగ్య శ్రీ పర్మిషన్ పేరుతో విజయలక్ష్మి తనను మోసం చేశారని సత్తెనపల్లికి చెందిన డాక్టర్ చక్రవర్తి ఈరోజు పోలీసులను ఆశ్రయించారు. ఆరోగ్య శ్రీ పర్మిషన్ ఇప్పిస్తానంటూ విజయలక్ష్మి తన నుంచి రూ.4 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు.
తన నగదును వెనక్కి ఇప్పించాలనీ, అలాగే తనను మోసం చేసిన విజయలక్ష్మిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు డా.చక్రవర్తి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో విజయలక్ష్మితో పాటు బొమ్మిశెట్టి శ్రీను, పోట్ల ప్రసాదుపై ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పూనాటి విజయలక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కె ట్యాక్స్ పేరుతో వసూళ్ల నేపథ్యంలో కోడెల కుమారుడు శివరామ్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు అయ్యాయి.