Andhra Pradesh: పావురాల గుట్టలో వైఎస్సార్ స్మృతివనం.. రూ.25 కోట్లతో నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం!
- 2009, సెప్టెంబర్ 2న వైఎస్ దుర్మరణం
- పావురాల గుట్టలో కూలిపోయిన హెలికాప్టర్
- అక్కడే స్మృతివనం నిర్మిస్తామన్న మంత్రి బాలినేని
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి కర్నూలు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ కూలిపోవడంతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ హెలికాప్టర్ కూలిపోయిన పావురాల గుట్ట ప్రాంతంలో వైఎస్సార్ స్మృతివనం నిర్మిస్తామనీ, ఇందుకు రూ.25 కోట్లు కేటాయిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు. ఎర్రచందనం పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం నిల్వల్లో 5,000 టన్నులను అమ్మేందుకు కేంద్రం అనుమతి కోరామని తెలిపారు. వన్యప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయే కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తామని పేర్కొన్నారు.