facebook: ఫేస్‌బుక్ కొత్త కరెన్సీ ‘లిబ్రా’: నగదు వ్యవహారాల వ్యాపారంలోకి సామాజిక మాధ్యమం!
- ఇందుకోసమే అంతర్జాతీయ కరెన్సీ సృష్టించినట్లు వెల్లడి
- వచ్చే ఏడాది మార్కెట్లోకి డిజిటల్ నగదు
- మానిటరీ వ్యాపారంలోకి సమాచార మాధ్యమం
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ నగదు వ్యవహారాల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సొంత డిజిటల్ నగదు ‘లిబ్రా’ను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది మార్కెట్లోకి ఈ అంతర్జాతీయ డిజిటల్ నగదు ప్రవేశిస్తుందని వెల్లడించింది. ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా ఖాతాదారులు తమ నగదును దాచుకోవడం, పంపడం, ఖర్చు చేయవచ్చునని తెలిపింది.
ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపినంత సులువుగా లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. ఔత్సాహిక డెవలపర్లు ఉపయోగించుకోవడానికి వీలుగా లిబ్రా ప్రోటోటైప్ (నమూనా)ను ఓపెన్ సోర్సు కోడ్ (అందరూ ఉపయోగించుకునేలా) తరహాలో ఫేస్‌బుక్ తన దాదాపు 24 మంది భాగస్వాములతో కలిసి విడుదల చేసింది.
జెనీవాలోని ఒక లాభాపేక్ష రహిత సంఘం ఈ బ్లాక్‌చైన్ ఆధారిత లిబ్రా పనులను పర్యవేక్షించనుంది. ఈ సంస్థ లిబ్రా విలువ స్థిరంగా ఉండేలా చూస్తుంది. ప్రపంచంలో ఇప్పటికీ బ్యాంకు సేవలు అందని వంద కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారని ఈ సంస్థ అంచనా వేసింది. వీరికి ఆన్‌లైన్ కామర్స్, ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురాగలమని లిబ్రా అసోసియేషన్ అధిపతి (పాసీ, కమ్యూనికేషన్స్) డాంటే డిస్సార్టీ తెలిపారు.