Andhra Pradesh: అమలులోకి వచ్చిన వారాంతపు సెలవు... సీఎం జగన్ మేలును మరువబోమంటున్న పోలీసులు!
- అమలులోకి వచ్చిన వీక్లీ ఆఫ్
- జగన్ కు పోలీసు కుటుంబాల కృతజ్ఞతలు
- 19 రకాల ఆప్షన్స్, ప్రత్యేక సాఫ్ట్ వేర్ సిద్ధం
దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండిపోయిన పోలీసులకు వీక్లీ ఆఫ్ సదుపాయం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దగ్గరైంది. రాష్ట్రంలో నేటి నుంచి వారాంతపు సెలవు అమలులోకి రానుండగా, కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయిలోని వారంతా వారంలో ఒకరోజు పూర్తిస్థాయిలో కుటుంబంతో గడిపే అవకాశం దగ్గరైంది. ఇక తమకు ఇంతటి సదుపాయాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేలు మరువబోమని అంటున్నారు పోలీసులు. నేడు వీక్లీ ఆఫ్ పొందిన వారు, తమ కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లనున్నామని, మధ్యాహ్నం రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేస్తామని చెబుతుండగా, తన తండ్రి ఇంట్లోనే ఉండటంతో, నేడు స్కూల్ కు డుమ్మా కొట్టామని చిన్నారులు అంటున్నారు.
కాగా, పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న సిబ్బంది, వారు చేసే పని తదితరాల ఆధారంగా 19 రకాల ఆప్షన్స్ తో వారాంతపు సెలవును అమలు చేసేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, వాటికి ఆమోదముద్ర పడింది. ప్రతి యూనిట్ ఆఫీసర్ ఈ 19 ఆప్షన్స్ లో ఒకదాన్ని తాను ఎన్నుకోవచ్చు. ఆపై రెండు నెలలకోసారి అవసరమైతే మార్పు చేర్పులు చేస్తుంటారు. ఎవరు ఎప్పుడు సెలవులో ఉంటారన్న విషయం ఉన్నతాధికారులకు తెలిసేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ సైతం సిద్ధమవుతోంది.