Lok Sabha: లోక్‌ సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లా ఏకగ్రీవ ఎన్నిక... మరోసారి 'జై శ్రీరామ్' నినాదాలతో దద్దరిల్లిన సభ!

  • స్పీకర్ పదవికి ఒకేఒక నామినేషన్
  • ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెమ్ స్పీకర్
  • అభినందనలు తెలిపిన పలువురు

17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్ సభ స్పీకర్ పదవికి నిన్న షెడ్యూల్ ను ప్రకటించగా, ఆర్ఎస్ఎస్ విధేయుడు, రాజస్థాన్ లోని కోట నియోజకవర్గ ఎంపీ ఓమ్ ప్రకాశ్ బిర్లా ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మరో నామినేషన్ పడకపోవడంతో, ప్రొటెమ్ స్పీకర్ వీరేంద్ర కుమార్, కొద్దిసేపటి క్రితం స్పీకర్ గా ఓమ్ బిర్లా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. ఆపై లోక్ సభ జై శ్రీరామ్, జై హింద్ నినాదాలతో మారుమోగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తదితరులు ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి ఆసీనులను చేశారు. ఈ సందర్భంగా బిర్లాకు పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు, లోక్ సభ అధికారులు అభినందనలు తెలిపారు.

కాగా, 1962 నవంబర్ 23న జన్మించిన ఓమ్ బిర్లా, కామర్స్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టాను పొందారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అందిపుచ్చుకుని 1991 నుంచి 1997 వరకూ రాజస్థాన్ బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆపై 2003 వరకూ జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగానూ సేవలందించారు. 2003లో రాజస్థాన్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన ఆయన, 2008, 2013లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2014లో కోటా నుంచి తొలిసారి లోక్ సభకు ఎన్నికైన ఆయన, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచారు. మోదీ - అమిత్ షా ద్వయానికి అత్యంత విధేయులైన నేతల్లో ఓమ్ బిర్లా ముందు వరుసలో ఉంటారన్న ప్రచారం ఉంది.

Lok Sabha
Om Birla
Narendra Modi
Amit Shah
  • Loading...

More Telugu News