Uttar Pradesh: అయోధ్య ఉగ్ర దాడి కేసులో నలుగురికి జీవిత ఖైదు
- 2005 జులై 5న అయోధ్యలో ఉగ్ర దాడి
- ఈ దాడిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఒక మహిళ సహా ఇద్దరు పౌరులకు గాయాలు
- తీర్పు వెలువరించిన ప్రయాగరాజ్ ప్రత్యేక న్యాయస్థానం
అయోధ్యలో ఉగ్ర దాడి కేసులో నలుగురు నిందితులను దోషులుగా ప్రయాగరాజ్ ప్రత్యేక న్యాయస్థానం తేల్చింది. ఈ నలుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు స్పెషల్ జడ్జి దినేశ్ చంద్ర తీర్పు వెలువరించారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.
2005 జులై 5న ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు భక్తుల రూపంలో అయోధ్యలోని వివాదస్పద రామమందిరం ప్రాంతంలోకి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. బారికేడ్ల వద్ద వారిని భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అయితే, సాయుధ ఉగ్రవాదుల్లో ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో వాహనంలో ఉన్న ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసురుతూ, విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ ముందుకెళ్లేందుకు యత్నించారు.
భద్రతా దళాలు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వారిని తీవ్రంగా ప్రతిఘటించారు. సీతా రసోయి ఆలయం వద్ద మిగిలిన ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఒక మహిళ సహా ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.