Andhra Pradesh: ఏపీలో పొగాకు రైతులను ఆదుకోవాలని మంత్రి పీయూష్ ను కోరాను: ఎంపీ జీవీఎల్
- ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల దుస్థితి చూశాను
- వారిని ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించా
- మంత్రి పీయూష్ సానుకూలంగా స్పందించారు
ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల దుస్థితి చూస్తుంటే ఆవేదన కలుగుతోందని, వారి సమస్యలపై స్పందించి వెంటనే ఆదుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఓ వినతిపత్రం అందజేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో పొగాకు వేలం కేంద్రాలను పరిశీలించానని, ఆ తర్వాతే పీయూష్ గోయల్ కు ఈ వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. దీనిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారని జీవీఎల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ కు సమర్పించిన వినతిపత్రాన్ని తన ఖాతాలో జతపరిచారు.
ఏపీలో ముఖ్యంగా తన సొంత జిల్లా అయిన ప్రకాశంలో పొగాకు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా వరుస కరవు కారణంగా పొగాకు రైతులు దయనీయస్థితిలో ఉన్నారని అన్నారు. గతంతో పోలిస్తే తక్కువ వర్షాల కారణంగా నాణ్యతలేని ఎక్కువ పొగాకు ఉత్పత్తి అయిందని, నాణ్యతలేని ఈ పొగాకును కొనుగోలు చేసేందుకు టొబాకో బోర్డ్ నిర్వహించే వేలం కేంద్రాలలో ఎవరూ ముందుకు రావడం లేదని జీవీఎల్ పేర్కొన్నారు. నాణ్యతలేని పొగాకును తిరిగి వెనక్కి తీసుకుపోవాల్సిందిగా రైతులకు చెబుతున్న విషయాన్ని పీయూష్ దృష్టికి జీవీఎల్ తీసుకెళ్లారు.