Designer: డేటింగ్ వెబ్ సైట్లో డిజైనర్ సెల్ నంబర్... 'ఎక్కడికి రావాలి?' అంటూ ఫోన్ల వెల్లువ!

  • హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైనర్ గా ఉన్న మహిళ
  • వ్యాపార అవకాశం లభిస్తుందని ఓ వ్యక్తికి ఫోన్ నంబర్ షేర్
  • డేటింగ్ వెబ్ సైట్లో పెట్టడంతో అసభ్య ఫోన్ కాల్స్
  • నిందితుడి కోసం వేట ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు

హైదరాబాద్ కు చెందిన ఓ ఇంటీరియర్ డిజైనర్‌, సెల్ ఫోన్ నంబర్ డేటింగ్ వెబ్ సైట్ లో ప్రత్యక్షంకాగా, ఎక్కడికి రావాలి? ఎంత ఇవ్వాలి? అంటూ ఫోన్లు వెల్లువెత్తడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నగరంలో నివసించే యువతి వృత్తిరీత్యా తన డిజైన్లకు ప్రచారం లభించాలన్న కోరికతో, సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌, ట్విట్టర్ తదితరాల్లో ఖాతాలను ప్రారంభించింది. ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు తాను ప్రతినిధి నంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. సౌత్ ఇండియాలోని తమ సంస్థ కార్యాలయాల్లో డిజైన్లు చేయాలని కోరాడు. అధికారులతో మాట్లాడతానని, వివరాలన్నీ ఫోన్‌ లో మాట్లాడుకుందామని చెబితే, ఆమె తన నంబర్ ఇచ్చింది.

ఆపై రెండు రోజుల తరువాత అతను ఆమె వివరాలను, ఫోన్ నంబర్ ను డేటింగ్‌ వెబ్‌ సైట్లలో పెట్టాడు. అంతే, ఆమెకు ఫోన్లు రావడం ప్రారంభమైంది. ఫోన్ చేసిన వారు అసభ్యంగా మాట్లాడుతుంటే, హతాశురాలైన ఆమె, ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ కాల్ చేయగా, రెండు డేటింగ్‌ సైట్లలో ఉందంటూ వారు చెప్పడంతో, ఏం చేయాలో తెలీని ఆమె, సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News