Cricket: బంగ్లాదేశ్ లక్ష్యఛేదనలో కుదుపులు... స్కోరు 26 ఓవర్లలో 3 వికెట్లకు 172 రన్స్
- షకీబల్ హాఫ్ సెంచరీ
- రనౌట్ గా వెనుదిరిగిన తమీమ్ ఇక్బాల్
- పోరాడుతున్న బంగ్లాదేశ్
వెస్టిండీస్ విసిరిన 322 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 26 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 24 ఓవర్లలో 150 పరుగులు చేయాలి. టాంటన్ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 321 పరుగులు చేసింది. అనంతరం, భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ కు శుభారంభం లభించింది. తొలి వికెట్ కు 52 పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్ సౌమ్య సర్కార్ (29) పెవిలియన్ చేరాడు.
ఈ దశలో మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. అయితే అర్ధసెంచరీ ముంగిట తమీమ్ ఇక్బాల్ రనౌట్ కావడంతో బంగ్లాదేశ్ కీలకమైన వికెట్ కోల్పోయింది. మరోవైపు షకీబల్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆదుకుంటాడనుకున్న ముష్ఫికర్ రహీం (1) స్వల్పస్కోరుకు వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో షకీబల్ (62) కు తోడుగా లిట్టన్ దాస్ (15) ఆడుతున్నాడు.