Uttar Pradesh: నెలరోజులుగా కుమార్తె శవంతో కాలం గడుపుతున్న రిటైర్డు పోలీసు అధికారి దంపతులు

  • ఉత్తరప్రదేశ్ లో దిగ్భ్రాంతికర ఘటన
  • తమ కుమార్తె నిద్రపోతోందని చెప్పిన తండ్రి
  • మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో అత్యంత బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ విశ్రాంత పోలీసు అధికారి దంపతులు నెలరోజులుగా కుమార్తె శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా హయత్ నగర్ లో నివాసం ఉండే దిలావర్ సిద్ధికీ పోలీసు డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేసి కొంతకాలం కిందట రిటైరయ్యారు. అయితే, గత కొన్నిరోజులుగా ఆయన ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన పోలీసులు సిద్ధిఖీ నివాసం తలుపులను బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించి దిగ్భ్రాంతి చెందారు.

కుళ్లి, కంపుకొడుతున్న శవంతో సిద్ధిఖీ దంపతులు దర్శనమిచ్చారు. ఆ శవం వాళ్ల కుమార్తెదని తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, రిటైర్డ్ పోలీసు అధికారి దంపతులను చూస్తుంటే మానసికంగా దెబ్బతిన్నట్టు అర్థమవుతోందని జిల్లా ఎస్పీ ప్రకాశ్ స్వరూప్ పాండే తెలిపారు. వాళ్లిద్దరూ ఎంతసేపటికీ, తమ కుమార్తె బతికే ఉందని, నిద్రపోతోందని చెప్పడం చూసి వాళ్ల మానసిక స్థితిపై సందేహం కలిగిందని చెప్పారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మృతికి కారణాలు తెలుస్తాయని, దాన్నిబట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. కాగా, సిద్ధిఖీ కుటుంబం తమతో ఎప్పుడూ కలిసేది కాదని, ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాళ్లని ఇరుగుపొరుగు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News