Andhra Pradesh: ఆరోజు జగన్ ఒక్కమాట చెప్పి ఉంటే సీఎం అయ్యేవాడు.. సోనియాగాంధీతో గొడవ అనవసరంగా జరిగింది!: జేసీ దివాకర్ రెడ్డి

  • ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు జగన్ కలవాల్సింది
  • పార్టీలో అందరూ జగన్ కే మద్దతుగా ఉన్నారు
  • ఏపీ అసెంబ్లీ వద్ద మీడియాతో టీడీపీ నేత

సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకొచ్చిన వైఎస్ జగన్ నేరుగా సోనియాతో తలపడ్డారనీ, అది విధిరాత అని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆరోజు సోనియా గాంధీతో జగన్ తలపడాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ లాబీ దగ్గర మీడియాతో జేసీ మాట్లాడుతూ..‘ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చినప్పుడు లేచి నిలబడి సార్.. నేను ఒకడిని ఉన్నాను. గుర్తించండి అంటే అయిపోయేది కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని చేసేందుకు నూటికి నూరు శాతం మద్దతు జగన్ కే ఉంది. పార్టీలో వైఎస్ కొడుకుగా సానుభూతి జగన్ పైనే ఉండేది. కానీ విధిరాత. అలా జరిగింది’ అని తెలిపారు.

తాను చంద్రబాబును పొగిడిన రోజులు, విమర్శించిన రోజులు ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. గ్రామాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు ప్రయత్నించారనీ, అందుకే ఆయన్ను ప్రశంసించానని పేర్కొన్నారు. జగన్ కూడా చంద్రబాబు బాటలోనే నడవాలని కోరుకుంటున్నానని చెప్పారు. జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసనీ, అతనిది ఉద్రేకంతో కూడిన స్వభావమని వ్యాఖ్యానించారు. ఒకడు చెబితే ఆయన వినిపించుకోరని తాను భావించానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అభిప్రాయాలు అన్నాక మారుతాయనీ, బతికినంతకాలం ఒకే అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Jagan
Sonia Gandhi
jc diwakar reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News