Lok Sabha: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్రకుమార్: ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
- మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ దళిత నేత
- తికమ్‌గఢ్ నుంచి ఏడుసార్లు ఎంపీగా విజయకేతనం
- బుధవారం జరగనున్న స్పీకర్ ఎన్నిక
లోక్‌సభ ప్రొటెమ్ స్పీకర్‌గా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దళిత నేత వీరేంద్రకుమార్ ఎన్నికయ్యారు. తికమ్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన సభలో అత్యంత సీనియర్. మోదీ తొలివిడత ప్రభుత్వ హయాంలో వీరేంద్రకుమార్ స్త్రీ శిశు సంక్షేమం, మైనార్టీ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు. ఈసారి కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు.
రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరేంద్రకుమార్ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈరోజు లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాక సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. 19వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ పదవికి మేనకాగాంధీ, రాధామోహన్‌సింగ్, అహ్లూవాలియా, జువార్ ఓరామ్ పేర్లు వినిపిస్తున్నాయి.