Sarfaraj Ahmad: మా కొంప అక్కడే మునిగింది: సర్ఫరాజ్ అహ్మద్
- మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయాం
- రోహిత్ పై బౌలింగ్ ప్రణాళికలు పనిచేయలేదు
- తదుపరి మ్యాచ్ లలో రాణిస్తామన్న సర్ఫరాజ్
కేవలం మూడు ఓవర్ల వ్యవధిలో నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోవడం తమ కొంప ముంచిందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యాఖ్యానించాడు. నిన్న ఇండియాతో మ్యాచ్ లో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన సర్ఫరాజ్, టాస్ ను గెలిచి కూడా ఆ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకోలేకపోయామని అభిప్రాయపడ్డాడు.
మ్యాచ్ లో క్రెడిట్ భారత బ్యాట్స్ మెన్ దేనని అన్నాడు. తమ బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయలేదని, తాను అద్భుతమైన ఆటగాడినని రోహిత్ శర్మ మరోసారి నిరూపించుకున్నాడని అన్నాడు. రోహిత్ ను సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయాలని ప్రణాళికలు రూపొందించినా, అవి పనిచేయలేదని చెప్పాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ ఇండియా సమష్టిగా రాణించిందని పేర్కొన్నాడు. బాబర్, ఫఖార్, ఇమామ్ లు బాగా ఆడినా, అదే ఊపును కొనసాగించలేకపోయామని, ఈ పరిస్థితి తమకు కఠినమే అయినా, మిగతా మ్యాచ్ లలో రాణిస్తామన్న నమ్మకం ఉందని అన్నాడు.