Tanushree Dutta: నటుడు నానా పటేకర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రధానిని ప్రశ్నించిన నటి తనుశ్రీ దత్తా
- లైంగిక వేధింపుల కేసులో నానాపటేకర్‌కు క్లీన్ చిట్
- భారతదేశ పుత్రికపై బహిరంగంగా దాడి జరిగితే సాక్ష్యాలు లేవంది మీ పోలీసు వ్యవస్థ
- మీరు చెబుతున్న రామరాజ్యం ఇదేనా? అని ప్రశ్న
బాలీవుడ్ నటుడు నానాపటేకర్ దశాబ్దం క్రితం సెట్స్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన ఆరోపణలు చేస్తూ ‘మీటూ’ ఉద్యమానికి ఆజ్యం పోసింది నటి తనుశ్రీ దత్తా. ఆమె తర్వాత ఎంతోమంది మహిళా నటులు, వివిధ రంగాలకు చెందినవారు బయటకు వచ్చి ఆమెతో గొంతు కలిపారు. తాము కూడా బాధితులమేనంటూ ‘మీటూ’ ఉద్యమాన్ని ముందుకు నడిపారు.
తాజాగా తనుశ్రీ కేసులో వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. దీంతో ఆమె చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఈ కేసును కోర్టు కొట్టివేసింది. నానాపటేకర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన తనుశ్రీ.. పోలీసులు, న్యాయవ్యవస్థ అవినీతి కూపంలో చిక్కుకున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, తన పోరాటాన్ని మాత్రం ఆపబోనని, ఏదో ఒకరోజు విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.
నానాపటేకర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఈసారి ప్రధాని నరేంద్రమోదీని తనుశ్రీ టార్గెట్ చేసింది. మీరు చెబుతున్న అవినీతి రహిత భారతం ఏమైందని సూటిగా ప్రశ్నించింది. ‘‘భారత దేశ పుత్రిక ఓ వ్యక్తి చేతిలో తీవ్ర అన్యాయానికి గురైతే, బహిరంగంగా ఆమెపై దాడి జరిగితే ఏమీ జరగలేదని మీ పోలీసులు చెబుతున్నారు. తప్పుడు ఫిర్యాదు అంటున్నారు. మీరు చెబుతున్న రామరాజ్యం ఇదేనా? నా ప్రశ్నకు బదులివ్వండి’’ అంటూ ప్రశ్నించింది.