Treasure: పురాతన ఆలయంలో గుప్త నిధి దొరికిందంటూ ప్రచారం!
- పురాతన బిందె తీసుకెళుతుంటే చూసిన మహిళ
- ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు కోటి ఆఫర్
- వైరల్ అవుతున్న ఫోన్ కాల్ రికార్డులు
కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో ఇప్పుడో కొత్త చర్చ జరుగుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల రికార్డు వైరల్ కాగా, ఒకరికి లంకెబిందెలు దొరికాయని, ఆ విషయం బయట చెప్పకుండా ఉండేందుకు కోటి రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించిన ఓ వ్యక్తి, మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఈ కాల్ రికార్డులు ఉన్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం, రెండు నెలల క్రితం స్థానిక సిద్దవటం రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జయరామిరెడ్డి ఒక పురాతన బిందెను తన ఇంట్లోకి తీసుకెళుతుంటే ఓ మహిళ చూసింది. అదేమిటని అడుగగా, బయటకు చెప్పవద్దంటూ బతిమాలుకున్న జయరామిరెడ్డి, లంకెబిందెలని చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్త సుధాకర్ రెడ్డితో చెప్పగా, జయరామిరెడ్డితో బేరసారాలు జరిగాయి. విషయం బయటకు చెప్పకుండా ఉండాలంటే తమకు కోటి రూపాయలు ఇవ్వాలని సుధాకర్ కోరగా, బిందెలను ఓపెన్ చేయడానికి సమయం పడుతుందని, బయటకు తీశాక డబ్బిస్తానని జయరామిరెడ్డి చెప్పాడు.
ఆపై తాను అద్దెకు ఉంటున్న ఇంటికి జయరామిరెడ్డి రాకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్ లో సంభాషణలు జరిగాయి. అందుకు సంబంధించిన కాల్ రికార్డులు పట్టణంలోని వివిధ గ్రూపుల్లో షేర్ అవుతుండటంతో చర్చ జరుగుతోంది. పోరుమామిళ్ల సమీపంలో ఉన్న పురాతన చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో ఈ నిధి దొరికినట్టు కొందరు అంటున్నారు. దీనిపై ఆలయ పూజారిని సంప్రదించగా, తాను శనివారం మాత్రమే వస్తానని, ఆలయ సమీపంలో తవ్వకాలు జరిపి, మళ్లీ మట్టితో కప్పెట్టిన ఆనవాళ్లు చూశానని అన్నారు. మొత్తం ఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు.