Kuwait: కువైట్‌లో నిప్పుల వాన.. 63 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు?
- 1913లో కాలిఫోర్నియాలో 56.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- ఆ రికార్డును చెరిపేసిన కువైట్
- అధికారికంగా నిర్దారణ కావాలి
భానుడు మన దగ్గరే కాదు.. కువైట్‌లోనూ చెలరేగిపోతున్నాడు. నిప్పుల వాన కురిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఈ నెల 8న కువైట్‌లో ఏకంగా 63 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు స్థానిక పత్రిక ఒకటి తెలిపింది. అదే రోజున సౌదీ అరేబియాలోని అల్ మజ్మా నగరంలో 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. అయితే, ఈ వివరాలు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
10 జూలై 1913లో కాలిఫోర్నియాలోని ఫర్నెస్‌క్రీక్ రాంచ్‌లోని డెత్ వ్యాలీలో 56.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కాగా, ఇప్పుడా రికార్డును కువైట్ చెరిపేసింది. అలాగే, 13 సెప్టెంబర్ 1922లో లిబియాలోని ఎల్ అజీజియాలో 58 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెబుతున్నా అది తప్పని తేలింది. తాజాగా కువైట్ సిటీలో నమోదైనట్టు చెబుతున్న 63 డిగ్రీల ఉష్ణోగ్రత విషయంలోనూ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.