Lover: 'నువ్వు చంపుతావా? నన్ను చంపమంటావా?' అంటూ కాబోయే భర్తను ప్రియుడితో చంపించిన యువతి!
- రంజాన్ నాడు రైల్వేకోడూరులో హత్య
- ప్రియుడి మోజులో కాబోయే భర్త హత్య
- సహకరించిన ప్రియుడి మిత్రులు
- నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ నెల 23న తన అత్త కూతురితో వివాహం జరగాల్సిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి, రంజాన్ పండగ నాడు కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురికాగా, పోలీసులు కేసును ఛేదించి, విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అబ్దుల్ ఖాదిర్ కు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడిలో ఉంటున్న మేనత్త కూతురు శబ్నతో వివాహం నిశ్చయమైంది. అప్పటికే శబ్న ప్రిన్స్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అబ్దుల్ ఖాదిర్ తనకు వద్దని, ప్రియుడితోనే సంబంధం కొనసాగించాలని నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను చంపాలని ప్రియుడిని అడిగింది. అతను అంగీకరించకుంటే తానే చంపుతానని చెప్పింది. దీంతో ప్రిన్స్ తన స్నేహితులైన దీనదయాల్, సెల్వం, లక్ష్మణ్, బ్రిస్టన్ లతో మాట్లాడి, ఎలాగైనా అబ్దుల్ ను చంపాలని కోరుతూ డబ్బిచ్చాడు. వారు అందుకు అంగీకరించి, 5వ తేదీన రంజాన్ నిమిత్తం సొంత ఊరికి అబ్దుల్ రాగానే, అప్పటికే అక్కడకు చేరుకుని మాటేసివున్న వీరు కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో శబ్న, ఆమె ప్రియుడు ప్రిన్స్ లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని, వారి నుంచి హత్యకు వాడిన ఆయుధాలను, మారుతి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.