Train: దిగొచ్చిన రైల్వే శాఖ... మసాజ్ చేయించబోరట!
- రైళ్లలో మసాజ్ చేయాలని నిర్ణయం
- ఇండోర్ లో ప్రారంభించనున్నట్టు ప్రకటన
- విమర్శలు వెల్లువెత్తడంతో నిర్ణయం వెనక్కి
అధికార పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే శాఖ దిగివచ్చింది. ప్రయోగాత్మకంగా కొన్ని రైళ్లలో మసాజ్ సేవలను ప్రారంభించి, ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆలోచనకు స్వస్తి పలికింది. ఇండోర్ నుంచి బయలుదేరే 39 రైళ్లలో మసాజ్ సేవలను ప్రారంభించనున్నామని ఇటీవల పశ్చిమ రైల్వే ప్రకటించగా, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా పలువురు బీజేపీ ఎంపీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇతర ప్రయాణికుల ముందు మసాజ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది దేశ సంస్కృతికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు పలువురు లేఖలు కూడా రాశారు. దీంతో మెట్టుదిగిన రైల్వే శాఖ మసాజ్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.