Cricket: ఆవేశం వద్దు...చూడండి, ఆనందించండి.. ఇది కేవలం మ్యాచ్ మాత్రమే!: దాయాదుల సమరం నేపథ్యంలో అభిమానులకు కోహ్లీ విజ్ఞప్తి

  • రేపు మాంచెస్టర్ లో భారత్-పాక్ పోరు
  • టీమిండియాపై భారీ అంచనాలు
  • ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో అసలుసిసలైన మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు, దాయాదులైన భారత్, పాకిస్థాన్ జట్లు మాంచెస్టర్ లో రేపు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లపైనా ఒత్తిడి తీవ్రంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ ఒక్కటి కూడా మిగలకుండా అమ్ముడుపోగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది టీవీల్లో వీక్షించేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఇరు దేశాల అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

ఇది కేవలం మ్యాచ్ మాత్రమేనని, ఎవరూ ఆవేశానికి లోనుకావద్దని సూచించాడు. చూసి ఆనందించాలే తప్ప, తీవ్ర భావోద్వేగాలకు గురికావద్దని తెలిపాడు. పాక్ తో పోరు నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూం వాతావరణంలో ఎలాంటి మార్పులేదని, వరల్డ్ కప్ లో ఆడేందుకు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నామని కోహ్లీ స్పష్టం చేశాడు.

దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్ ఉద్వేగభరితమైనదేనని, పాకిస్థాన్ తో మ్యాచ్ ను కూడా తాము అదే దృష్టితో చూస్తామని వివరించాడు. కాగా, వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై భారత్ కు స్పష్టమైన రికార్డు ఉంది. ఆడిన ప్రతి వరల్డ్ కప్ లోనూ పాక్ పై టీమిండియానే పైచేయి సాధించింది.

  • Loading...

More Telugu News