Omkar: వేధింపులు.. ఈసడింపులు.. తట్టుకోలేక తనువు చాలించిన వైద్య విద్యార్థి!
- సోదరి పెళ్లి కోసం సెలవు కోరిన ఓంకార్
- నిరాకరించిన డిపార్ట్‌మెంట్ హెడ్
- హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య
నిత్యం అధికారుల వేధింపులతో తల్లడిల్లుతున్న ఓ వైద్య విద్యార్థి, సోదరి వివాహానికి వెళ్లడానికి కూడా అనుమతించకపోవడంతో మరింత మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తన హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చండీగఢ్‌లోని రోహ్‌తక్‌లో జరిగింది.
కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన ఓంకార్, రోహ్‌తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పీడియాట్రిక్స్ విభాగంలో ఎండీ చదువుతున్నాడు. అతను నిత్యం భాష విషయంలో తన విభాగానికి చెందిన వైద్యులు ప్రొఫెసర్ల వేధింపులకు గురవుతున్నాడు.
తాజాగా తన సోదరి వివాహానికి వెళ్లేందుకు తన డిపార్ట్‌మెంట్ హెడ్‌ను ఓంకార్ సెలవు కోరాడు. ఆయన ఎన్నిసార్లు అడిగినా ససేమిరా అనడంతో, అప్పటికే వేధింపుల కారణంగా మనస్తాపంతో ఉన్న ఓంకార్ మరింత ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో గురువారం అర్ధరాత్రి తన హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
డిపార్ట్‌మెంట్ హెడ్ కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని ఓంకార్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓంకార్ సహ విద్యార్థులు కూడా అతని కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. ఓంకార్ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసన తెలిపారు.