Congress: టీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే మోదీలాంటి నేత కావాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కేసీఆర్ ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే బీజేపీనే సరైన వేదిక
- తెలంగాణలో కాంగ్రెస్ కు యువనాయకత్వం వస్తుందని భావించాం
- రాహుల్ రాజీనామా చేసినా టీపీసీసీ చీఫ్ అలా ఆలోచించలేకపోయాడు
తెలంగాణలో కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు వింటే ఆ విషయం నిజమే అనిపించకమానదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, టీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే మోదీవంటి బలమైన నేత కావాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే బీజేపీనే తగిన వేదిక అని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని యువ నాయకత్వానికి అప్పగిస్తారని తాము భావించామని, కానీ అలా జరగలేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దుస్థితికి నైతిక బాధ్యతగా రాహుల్ గాంధీ తప్పుకుంటే, తెలంగాణలో టీపీసీసీ చీఫ్ అలా ఆలోచించలేకపోయాడని విమర్శించారు.