Narendra Modi: 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా భారత్ ను తీర్చిదిద్దడమే లక్ష్యం: నీతి ఆయోగ్ సమావేశంలో మోదీ
- రాష్ట్రాలు సహకరించాలి
- ఎగుమతుల రంగంపై దృష్టిపెట్టాలి
- కలసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైన ఈ సమావేశంలో మోదీ తమ భవిష్యత్ కార్యాచరణ వెల్లడించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సాధించడంలో నీతి ఆయోగ్ దే కీలకపాత్ర అని ఉద్ఘాటించారు. 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా భారత్ ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చాటి చెప్పారు. అయితే, అందుకు రాష్ట్రాల సహకారం ఎంతో అవసరమని అన్నారు.
ఆదాయ పెంపు, ఉపాధి కల్పనలో ఎగుమతుల విభాగమే కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రతి రాష్ట్రం కూడా ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. నీటి యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణ, జలవనరుల వినియోగంలో రాష్ట్రాలు అనేక విధాలుగా చొరవ తీసుకోవాలని మోదీ కోరారు. పాలనలో పారదర్శకత ఉంటే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింస తదితర ప్రధాన సమస్యలపై సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
జాతిపిత మహాత్మగాంధీ 150వ వార్షికోత్సవం కోసం నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబరు 2వ తేదీలోగా నెరవేర్చాలని పిలుపునిచ్చారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తయిందని, ఇక ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. జీడీపీ వృద్ధి ఆశించినస్థాయిలో రావాలంటే క్షేత్రస్థాయిలో జిల్లాను ప్రాతిపదికగా తీసుకుని కార్యాచరణకు రూపకల్పన చేయాలని తెలిపారు.