Andhra Pradesh: విశాఖపట్నంలో నారాయణ, నలంద సహా 10 పాఠశాలలు సీజ్!
- ప్రభుత్వ అనుమతి లేకుండానే నిర్వహణ
- తనిఖీలు చేపట్టి జప్తు చేసిన డీఈవో
- తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచన
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా 10 పాఠశాలలు నడుపుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఈ స్కూళ్లను జప్తు చేశామని వెల్లడించారు. ఈ జాబితాలో నారాయణ స్కూలు(కైలాస మిట్ట), జాగృతి స్కూలు(గాజువాక), గ్లోబల్ స్కూలు, సుపాద స్కూలు, లోటస్ స్కూల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే స్టాన్ ఫర్డ్ స్కూలు, సన్ ట్రైట్ స్కూలు, నరసింహ స్కూలు, లిటిల్ ప్యారడైజ్ స్కూలు, నలందా హైస్కూల్ ను జప్తు చేశామని అన్నారు. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను ఇలాంటి ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో చేర్పించకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ మేరకు విశాఖ డీఈవో పత్రికా ప్రకటనను విడుదల చేశారు.