Andhra Pradesh: కోడెల శివరామ్ లీలలు.. రంజీ క్రికెటర్ నుంచి రూ.15 లక్షలు వసూలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు!
- రైల్వేశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
- తప్పుడు నియామక పత్రం ఇచ్చిన కోడెల శివరామ్
- నరసరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు నాగరాజు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే కోడెల కుటుంబం ‘కె ట్యాక్స్’ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడిందని 14 ఫిర్యాదులు రాగా, తాజాగా నాగరాజు అనే రంజీ క్రికెటర్ నరసరావుపేట పోలీసులను ఆశ్రయించాడు. రైల్వేశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని కోడెల కుమారుడు కోడెల శివరామ్ తన నుంచి రూ.15 లక్షలు వసూలు చేశాడని నాగరాజు తెలిపాడు. అనంతరం కాన్పూర్ లో జాయిన్ కావాలంటూ తప్పుడు నియామక పత్రం తయారుచేసి ఇచ్చాడని వెల్లడించాడు.
తాను కాన్పూర్ లోని రైల్వేశాఖ ఆఫీసుకు వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నాడు. ఈ విషయాన్ని తాను కోడెల శివప్రసాదరావు దృష్టికి రాగా, ఆయన అనుచరులు తన దగ్గర ఉన్న పత్రాలు లాక్కున్నారని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. కోడెల కుమారుడు శివరామ్ వసూలు చేసిన రూ.15 లక్షలను తిరిగి ఇప్పించాలనీ, శివరామ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నాగరాజు నరసరావుపేట డీఎస్పీని కోరారు. ఈ మేరకు తన ఫిర్యాదును అందజేశారు.