Tamil Nadu: రన్నింగ్‌లో ఉన్న బస్సు ‘టాప్’ లేచింది...అవాక్కయిన ప్రయాణికులు
- పైభాగం ఊడి కింద పడడంతో కంగారు
- భారీ శబ్దం రావడంతో బస్సు పక్కకు తీసి ఆపిన డ్రైవర్
- అప్పటికే ఊడి కిందకు వేలాడిన టాప్‌లో కొంత భాగం
తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు 35 మంది ప్రయాణికులతో పొలాచ్చి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఏదో శబ్దం వినిపించింది. దీన్ని గమనించిన డ్రైవర్ ఏదోలే అనుకుని అంతగా పట్టించుకోకున్నా రానురాను శబ్దం పెరుగుతుండడం, బస్సు రన్నింగ్‌లో తేడాగా అనిపించడంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకుందామన్న ఉద్దేశంతో బస్సును రోడ్డుపక్కకు నిలిపి దిగాడు. అయితే అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండి భారీగా గాలులు వీస్తున్నాయి. గాలుల కారణంగా బస్సు పైభాగం కప్పుగా వేసిన రేకు మొత్తం ఓ వైపు నుంచి ఊడిపోయి కిందకు వేలాడింది. ఇది చూసి ఆశ్చర్యపోవడం డ్రైవర్‌తోపాటు ప్రయాణికుల వంతయింది.
అప్పటికే బస్సు పైభాగంలో వెనుక నుంచి ముందు వరకు పూర్తిగా రేకు ఊడిపోయింది. ముందుభాగంలో అతుక్కుని ఉండడంతో బస్సు నుంచి వేలాడుతూ కనిపించింది. దాన్ని యథాస్థానంలో ఉంచేందుకు డ్రైవర్‌తోపాటు సిబ్బంది ఎంత ప్రయత్నించినా వీలుకాకపోవడంతో అలాగే వదిలేశారు. కాగా, బస్సు టాప్ రేకు లేచిపోయినా లోపల సీలింగ్ ఉండడంతో ఈ విషయం చాలాసేపటి వరకు ప్రయాణికులకు తెలియలేదు. అయితే అదృష్టవశాత్తు భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.