Crime News: ఇష్టంలేకున్నా ప్రభుత్వ కళాశాలలో చేర్పించారని విద్యార్థిని ఆత్మహత్య
- కర్నూలు జిల్లాలో విషాదం
- ప్రైవేటు కళాశాలలో చేర్పించాలని కోరిన బాలిక
- ఆర్థిక స్తోమత లేదని ప్రభుత్వ కళాశాలలో చేర్పించిన తల్లిదండ్రులు
వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా తల్లిదండ్రులు బలవంతంగా ప్రభుత్వ కళాశాలలో చేర్పించారన్న బాధతో ఓ ఇంటర్ విద్యార్థిని తీవ్ర నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులంతా నిద్రపోతున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. కర్నూలు జిల్లా పార్లపల్లె గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.
గ్రామానికి చెందిన రాజేశ్వరి (16) టెన్త్ పాసయ్యాక ప్రైవేటు కళాశాలో ఇంటర్ చదవాలని ఆశించింది. తల్లిదండ్రుల వద్ద అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేవని భావించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను స్థానిక ప్రభుత్వ కళాశాలలో చేర్పించారు. తల్లిదండ్రుల నిర్ణయంతో తప్పని పరిస్థితుల్లో ఆమె ప్రభుత్వ కళాశాలకు వెళ్తున్నా అక్కడి పరిస్థితులపై రాజీపడలేకపోయింది. తీవ్ర నిరాశకు గురైన ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది.
గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉండగా ఇంటి పక్క గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు కుమార్తె కనిపించక పోవడంతో ఇల్లంతా వెతికారు. ఆందోళనతో పక్క గదికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించడంతో గొల్లుమన్నారు.