Nellore District: సూళ్లూరుపేటలో అర్ధరాత్రి గాలివాన.. బీభత్సం
- ఈదురుగాలులతో కుప్పకూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
- ఎగిరి పడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు
- జనజీవనానికి అంతరాయం
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత గాలివాన బీభత్సం సృష్టించింది. హఠాత్తుగా ఈదురు గాలులు, ఆ తర్వాత వర్షం మొదలయ్యింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ మండిపోతోంది. పలుచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.
నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో 'ఇదిగో ఏపీ, తెలంగాణలోకి వచ్చేస్తున్నాయని' అన్నా అవి కాస్తా ముఖం చాటేశాయి. వర్ష ఛాయలే కనిపించడం లేదని, మరికొన్నాళ్లు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హఠాత్తుగా కురిసిన వర్షం స్థానికులకు ఊరటనిచ్చినా కొంత ఇబ్బంది కలిగించింది.
అర్ధరాత్రి ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కుప్పకూలిపోయాయి. అవి రోడ్డుకి అడ్డంగా పడడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే దాదాపు రెండు గంటలపాటు భారీ వర్షం కురవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనానికి గొప్ప ఊరటనిచ్చింది.