West Bengal: బెంగాల్‌లో కోమాలో వైద్య సేవలు.. 700 మంది వైద్యుల రాజీనామా!
- వరుసపెట్టి రాజీనామా చేసిన వైద్యులు
- బెంగాల్‌లో నిలిచిన వైద్య సేవలు
- అల్లాడిపోతున్న రోగులు
తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ కోల్‌కతా వైద్యులు చేపట్టిన ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది. జూనియర్ డాక్టర్ల ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. మరోవైపు, వారికి మద్దతుగా పశ్చిమబెంగాల్‌లో 700 మంది వైద్యులు రాజీనామా చేశారు. దీంతో వైద్య సేవలు స్తంభించి పోయాయి. రోగుల వెతలు వర్ణనాతీతంగా మారాయి. శక్రవారం వివిధ ఆసుపత్రులకు చెందిన 700 మంది ప్రభుత్వ వైద్యులు గంటల వ్యవధిలోనే రాజీనామా చేయడం కలకలం రేపింది.
వైద్యులు వెంటనే ఆందోళన విరమించి విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆదేశించిన గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. జూనియర్ వైద్యులకు మద్దతుగా ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైస్ ప్రిన్సిపాల్ గురువారం రాజీనామా చేశారు. అలాగే, బీటీ రోడ్డులోని సాగోర్ దత్తా మెడికల్ కాలేజీకి చెందిన 21 మంది సీనియర్ డాక్టర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇక శుక్రవారం ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీకి చెందిన 107 మంది రాజీనామా చేయగా, ఆ తర్వాతి గంటలోనే మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి చెందిన 100 మంది వైద్యులు రిజైన్ చేశారు. ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రి వైద్యులు 175 మంది, చిత్తరంజన్ నేషనల్ మెడికల్ కాలేజీకి చెందిన 16 మంది, ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ వైద్యులు 100 మంది, స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసన్‌కు చెందిన 33 మంది వరుసగా రాజీనామాలు చేశారు. గంటల వ్యవధిలోనే వందలాదిమంది రాజీనామా చేయడంతో వైద్య సేవలకు పెద్ద ఎత్తున ఆటంకం కలిగింది. అత్యవసర వైద్య సేవల కోసం ఎదురుచూస్తున్న రోగులు అల్లాడిపోతున్నారు.