Andhra Pradesh: ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియ షురూ.. కమిటీ ఏర్పాటు
- కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డి
- రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వనున్న కమిటీ
- దీని ఆధారంగా విలీనానికి విధివిధానాలు
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇందుకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి చైర్మన్ గా వ్యవహరించనున్న ఈ కమిటీలో ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్టీసీ ఈడీ, ఒక రిటైర్డ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆర్టీసీ కార్మికుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపై రెండు నెలల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపైనా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఐఆర్ఈడీఏ మాజీ ఎండీ భక్తవత్సలం నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో నలుగురు సభ్యులు ఉన్నారు.