Vijayawada: అధికార పార్టీ దారి తప్పితే ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తాం: బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్
- త్రిముఖ పోరు, క్రాస్ ఓటింగే నా ఓటమికి కారణం
- పార్టీ ఆదేశిస్తే మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తా
- కొత్త ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని భావిస్తున్నా
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. తమ ఓటమికి గల కారణాలపై, టీడీపీ భవిష్యత్ ప్రణాళికపై చర్చించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో విజయవాడలో నిర్వహించిన సమావేశానికి బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసి పరాజయం పాలైన భరత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, త్రిముఖ పోరు, క్రాస్ ఓటింగే తన ఓటమికి కారణమని విశాఖపట్ణణం నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన భరత్ అన్నారు. పార్టీ ఆదేశిస్తే మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తక్కువ ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యానని, తాను ఓడినా ప్రజల్లోనే ఉంటానని చెప్పారు.
రాజకీయాల్లోకి యువత ఇంకా రావాల్సిన అవసరం ఉందని, వాళ్ల ఆలోచనా తీరు ప్రతి పార్టీకి అవసరమేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం చేయబోతోందో చూస్తామని, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. కేవలం రాజకీయాల గురించి కాకుండా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం గురించి అధికార పార్టీ ఆలోచించాలని, ఒకవేళ, అధికార పార్టీ దారి తప్పితే ప్రతిపక్షంగా తమ పాత్ర తాము పోషిస్తామని స్పష్టం చేశారు.