West Bengal: పశ్చిమబెంగాల్ కు ఎవరు వచ్చినా బెంగాలీలోనే మాట్లాడాలి!: సీఎం మమతా బెనర్జీ
- నేను బిహార్, పంజాబ్ కు వెళితే అక్కడి భాషనే మాట్లాడతా
- బెంగాల్ లో నేరస్తులను రోడ్లపై తిరగనివ్వను
- కోల్ కతాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్య
అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఆందోళనలతో పశ్చిమబెంగాల్ రాష్ట్రం అట్టుడుకుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో 18 లోక్ సభ స్థానాలో గెలుపుతో బీజేపీ బలం పుంజుకున్న నేపథ్యంలో కమలనాథులకు చెక్ పెట్టేందుకు సీఎం మమతా బెనర్జీ బెంగాలీ వాదాన్ని తెరపైకి తెచ్చారు. కోల్ కతాలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తాను ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంత భాషను మాట్లాడుతానని తెలిపారు.
తాను బిహార్ లేదా పంజాబ్ కు వెళితే అక్కడి వారు మాట్లాడే భాషనే మాట్లాడుతానని చెప్పారు. ఒకవేళ ఎవరైనా బెంగాల్ వస్తే బెంగాలీలోనే మాట్లాడాలని సూచించారు. బెంగాలీని అన్నివిధాలుగా ప్రోత్సహించాలని మమత అభిప్రాయపడ్డారు. పశ్చిమబెంగాల్ లో రోడ్లపై తిరుగుతూ అలజడులు సృష్టించే నేరస్తులను వదిలిపెట్టబోమని మమతా బెనర్జీ హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ లోని 42 లోక్ సభ స్థానాలకు గానూ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 18 సీట్లతో, కాంగ్రెస్ ఒక్క సీటుతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.